Modern Medical Discoveries

The blog will track progress of AIDS prevention in India as well as talk about scientists of Indian origin

Wednesday, April 04, 2012

మానవాళికి మేలుచేసినమేధావి - తొంభై సంవత్సరాల క్రితం బోస్టన్ వచ్చిన తెలుగుతేజం  -  డా. ఎల్లాప్రగడసుబ్బారావు

రచన: డా. భీశెట్టి గోవింద రావు

       బోస్టన్ లో ముప్పై నలభై  సంవత్సరాల క్రితం వచ్చిన తెలుగువారిని మనం కలుస్తూవుంటాం. కాని అంతకన్నా ముందు వచ్చిన వారి గురించి మనకు అంతగా తెలియదు. తెలుసుకొనే మార్గాలు కూడా లేవు. ఇక్కడ తెలుగు సంఘం స్థాపించి 27 సంవత్సరాలు మాత్రమే అయింది. అలాంటప్పుడు ఎనభై - తొంభై సంవత్సరాలకి ముందువచ్చినవారి గురించి తెలుసు కోవడంకష్టం కదా! అప్పట్లో వచ్చిన వారు చాలా తక్కువ మంది. అయితే 1922 లో భీమవరం నుండి బోస్టన్ కు వచ్చిన ఒక మేధావి  హార్వర్డ్ యునివర్సిటీలో చేసిన పరిశోధనలు, వాటి ఫలితాలు, జీవరసాయన శాస్త్ర  పత్రికలలో అచ్చుకావడంతో, మనకు వీరి   గురించి తెలుసుకొనే ఆధారాలుదొరికాయి. బోస్టన్ లో చాలామంది తెలుగు వారికి, ముఖ్యంగా కొత్తగా వచ్చిన వారికి వీరి గురించి తెలియదు.  "You've probably never heard of Dr. Yellapragada Subba Rao. Yet because he lived you may be alive and are well today. Because he lived you may live longer." - Doron K. Antrim observed in the April 1950 issue of Argosy. 
  
      సుబ్బారావుగారు భీమవరంలో జనవరి 12, 1895న  జన్మించారు. చిన్నతనంలోనే వీరికి చాలాకష్టాలు ఎదురయ్యాయి. అయినా పట్టుదలతో చదువుకొని, మద్రాస్ మెడికల్ కాలేజీలోప్రవేశాన్ని సంపాదించుకొన్నారు. గాంధీ గారి బాటలో ఖద్దరు తొడుగుకొని క్లాసులకు వెళ్ళినందున ఒక  బ్రిటిష్ ప్రొఫెసర్ ఆగ్రహానికి గురయ్యారు. అందువలన అనాటమిలో తక్కువ మార్కులు ఇచ్చి, MBBS డిగ్రీ  ఇవ్వకుండా, LMS డిప్లొమా ఇచ్చి పంపారు. అయినా నిరాశ పొందకుండా , మద్రాస్ లో ఉన్న ఆయుర్వేద కళాశాలలో ఉపాధ్యాయుడుగా చేరి ఆయుర్వేద౦లో రీసర్చి చేయడం మొదలు పెట్టారు.ఆసమయంలో ఒక అమెరికన్ డాక్టర్ తో పరిచయం అయింది. అతని ప్రోత్సాహంతోబోస్టన్ లో హార్వర్డ్   మెడికల్ కాలేజీకి రావాలని నిర్ణయించుకున్నారు. పలు సంస్థల ఆర్ధిక సహాయంతో అక్టోబరు 26, 1922 న బోస్టన్ చేరుకున్నారు. ముందుగ సుబ్బారావు గారు హార్వర్డ్ మెడికల్ స్కూల్ లో ట్రోపికల్  మెడిసిన్ లో డిప్లోమ చేసారు. ఆ రోజుల్లోఆర్ధిక ఇబ్బందుల వలన రాత్రి పూట పోర్టర్ గా పనిచేసారు. డిప్లోమ చేతికివచ్చిన అతనికి బయో-కెమిస్ట్రీలో పరిశోధన చెయ్యాలని ఆలోచన కలిగి,  ప్రొఫెసర్ ఫిస్క్ ల్యాబ్ లో చేరారు. జీవరసాయన శాస్త్రంలో వీరిద్దరూ చేసిన ఎన్నోఅద్భుతమైన పరిశోధనల వలన వీరిద్దరి పేర్లు చిరస్మరణీయంగా నిలిచిపోయాయి.ముఖ్యంగా మన కండరాలు పనిచేయడానికి తోడ్పడే phosphocreatine మరియు ATP అనే రెండు రసాయనిక పదార్ధాలను మొదటిసారిగా కనిపెట్టారు.   వీరు 1925 లో ప్రచురించిన "phosphate determination" పధ్ధతి కాలేజీబయో కెమిస్ట్రీ పుస్తకాల్లోకి 1930 లో అచ్చువేసారు. ఈ పధ్ధతిని "Fiske -Subbarow method" అని అంటారు. ఈ పరిశోధనల ఆధారంగా సుబ్బారావు గారికి 1930 లో హార్వర్డ్ యూనివెర్సిటీ  వారుPh. D. పట్టాను బహూకరించి బయో కెమిస్ట్రీలో జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం ఇచ్చారు.  
       
       1940 లో సుబ్బారావు గారు న్యూయార్క్ లో ఉన్నLederle Laboratories అనే ఔషధ పరిశోధన కేంద్రంలో రిసెర్చ్ డైరెక్టర్ గా వెళ్ళారు. అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంజరుగుతుంది. సైనికులు గాయాలతో చనిపోతున్నారు. గాయాలకన్న వాటికి సోకిన bacterial infection వలన ఎక్కువమంది చనిపోతున్నారు.యుద్ధరంగం నుంచి, ప్రపంచంలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన  soil samples ను సుబ్బారావు గారు పరిశీలించి, వాటిలోని  బాక్టీరియాని అరికట్టే మూలపదార్ధాలను కనిపెట్టారు. ఈ విధంగా సుబ్బారావు గారిఆధ్వర్యంలో మొదటి టెట్రాసైక్లిన్ మందు కనిపెట్టారు. వీరే సొంతంగా  ఫోలిక్ యాసిడ్ అంటే vitamin B6 కొత్త పంథాలో తయారు చేసారు. ఇది అనేమియాను తగ్గించండానికి పనిచేస్తుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా కేన్సర్ వ్యాధికి మందు methotrexateని వీరు కనిపెట్టారు. ఫైలేరియాని నయంచేసే హెట్రజాన్ అనే మందుని కూడా వీరే కనుగొన్నారు. 
  
      డా.ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పరిశోధన ఫలితాలవల్ల ఎంతోమందికి జీవన కాలం పెరిగింది. కాని ఇతను తక్కువ వయసులోనే 1948 లో మరణించారు. వీరి ఆకస్మిక మరణాన్ని న్యూయార్క్  పత్రికలలో అద్భుతమయిన మందులను కనిపెట్టిన ఒక అద్భుత వ్యక్తి మరణించారని కొనియాడారు.మానవాళికి ఇంత మేలు చేసిన శ్రీ సుబ్బారావు గారికి ఎలాంటి బిరుదులు, బహుమతులు అందలేదు. వీరికి భారతరత్న బిరుదు ఇవ్వాలని చాలామంది భారతప్రభుత్వాన్ని కోరారు.ఇంతవరకు అది జరగలేదు. వీరి పేరు ప్రఖ్యాతులు ఈ తరం వారికి చాలా మందికి తెలియదు. మనమయినా ఈ మహనీయుడు మన బోస్టన్ కు చెందిన తెలుగువాడని గర్విద్దాం. వీరి గురించి తెలుసుకొని పదిమందికి వీరు చేసిన మేలు గురించి చెప్పడం మన బాధ్యత. ముఖ్యంగా సుబ్బారావు గారి జీవనం మన పిల్లలకు ఒకస్ఫూర్తినివ్వాలి.

0 Comments:

Post a Comment

<< Home